రైతులు నాణ్యతా ప్రమాణాలు పాటించాలి: మంత్రి ఎర్రబెల్లి

జిల్లాలోని రాగన్నగూడెంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, తాలు, తేమ లేకుండా ధాన్యాన్ని ఆరబెట్టి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని రైతులకు సూచించారు. తెలంగాణల ప్రభుత్వం మాదిరిగా దేశంలోని మరే రాష్ట్రం రైతులకోసం పాటుపడటం లేదని, సీఎం కేసీఆర్‌ రాష్ర్టాభివృద్ధి కోసం అను నిత్యం శ్రమిస్తున్నారన్నారు. రైతులకు 24 గంటల విద్యుత్‌ అందివ్వడంతోపాటు, విత్తనాలు, ఎరువులు, పెట్టుబడులను ప్రభుత్వమే సమకూరుస్తుందని, చివరకు ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తుందని చెప్పారు. అదేవిధంగా కొలలన్‌పల్లిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. రైతుల సమస్యలు తెలుసుకుని, వాటిని పరిష్కరించాలని అధికారులకు సూచించారు.