కరోనా మహమ్మారి సృష్టించిన సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు అన్నిరకాల వనరులను సమీకరిస్తున్న ప్రభుత్వాలు తప్పనిసరై పలు రంగాలకు కోతలు పెడుతున్నాయి. దేశంలో కరోనా వైరస్‌కు హాట్‌బెడ్‌గా ఉన్న మహారాష్ర్టలో నిధులను సమీకరించేందుకు ప్రభుత్వం ఆ రాష్ట్ర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వేతనాల్లో కోత పెట్టింది. మార్చి నెలలో వీరి వేతనాల్లో 60శాతం కోత విధిస్తున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మంగళవారం తెలిపారు. ముఖ్యమంత్రితో సమావేశమైన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో కూడా కోత పెడుతున్నట్లు ప్రకటించారు. క్లాస్ 1,2 ఉద్యోగుల వేతనాల్లో 50శాతం, క్లాస్ 3 ఉద్యోగుల వేతనాల్లో 25శాతం కోత విధిస్తున్నట్లు వెల్లడించారు. ఇతర బ్యూరోక్రటిక్ ఉద్యోగుల వేతనాల్లో ఎలాంటి కోతలు ఉండవని తెలిపారు. కరోనాను ఎదుర్కోనేందుకు జరుగుతున్న పోరాటంలో ప్రభుత్వానికి భారీ ఎత్తున నిధులు అవసరమని ఈ విషయాన్ని ప్రజాప్రతినిధులంతా అర్థం చేసుకుంటారని భావిస్తున్నం అని అజిత్ పవార్ ఆశాభావం వ్యక్తం చేశారు.
మహారాష్ర్టలో వేతనాల్లో కోత